బాలయ్య ఇలాఖాకు మరో వెయ్యి ఎన్టీఆర్‌ ఇళ్లు!

balakrishna ntr housing programme

ఎన్టీఆర్‌ గ్రామీణ ఇళ్ల నిర్మాణ పథకం కింద హిందూపురానికి వెయ్యి ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మాంజూరు చేసింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఇళ్ల నిర్మాణంలో యూనిట్‌కు రూ.1.50 లక్షలు కాగా, ఉపాధి హామీ పథకం కింద రూ.55 వేలు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కింద రూ.95వేల చొప్పున లబ్థిదారులకు ఇవ్వనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో ప్రజాప్రతినిధులు, గృహనిర్మాణ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు తలమునకలయ్యారు. ఇప్పటికే పట్టణం, నియోజకవర్గానికి వెయ్యి ఇళ్లు మాంజూరు కాగా ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక చొరవ చూపి మరో వెయ్యి మంజూరు చేయించారు. ఈ ఇళ్లను నియోజకవర్గంలోని చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇస్తూ అన్నివర్గాలకు కేటాయించారు.

ఇందులో ఎస్సీ 17.1 శాతం, ఎస్టీ 5.33, మైనార్టీ 6, ఇతరులకు 70 శాతం చొప్పున ఎంపిక చేయనున్నారు. బాలకృష్ణ నియోజకవర్గంలో పక్కా ఇళ్లులేని ప్రజలకు ఇళ్లు నిర్మించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి తన నియోజకవర్గానికి అదనంగా ఇళ్లు కేటాయించాలన్న విజ్ఞప్తి మేరకు వెయ్యి ఇళ్లు మంజూరుచేశారు. భవిష్యత్తులో మరిన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికీ పక్కాఇళ్లు నిర్మించే విధంగా ప్రణాళికబద్ధంగా పావులు కదుపుతున్నారు. మంజూరైన వెయ్యి ఇళ్లకు రెండు రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక పక్రియ పూర్తిచేయనున్నట్లు గృహనిర్మాణ శాఖ డీఈఈ మూర్తి తెలిపారు. సాంకేతిక అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణం చేపడతామన్నారు.


Teluguwow Tv

Related News