ఊరికో థియేటర్‌ ఇవ్వండి చాలు

Head Constable Venkatramaiah Movie Release On Sankranthi

‘‘క్రేజ్‌ని క్యాష్‌ చేసుకుంటున్న రోజలివి. 30 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి నా సినిమా సంక్రాంతికి విడుదలవుతుంటే మెగాస్టార్‌, యువరత్న సినిమాల మధ్య పీపుల్‌స్టార్‌ సినిమా అని జనాలు అంటున్నారు. వారితో నాకు పోటీలేదు. సినిమా విడుదలకు అన్ని సన్నాహాలు చేసుకున్నాక థియేటర్లు దక్కలేదంటే ఏడుపొస్తుంది. మేం వందల థియేటర్లు ఆశించట్లేదు. నాలుగు థియేటర్లు ఉన్న ఊర్లో మాకు ఒక థియేటర్‌ ఇస్తే చాలంటున్నాం. ప్రభుత్వం, ఛాంబర్‌, నిర్మాతల మండలి ఇందుకు సహకరించాలి’’ అని ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. ఆయన కథానాయకుడిగా చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ‘హెడ్‌కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య’ చిత్రం ఈ నెల 14న విడుదలకానుంది. జయసుధ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని చదలవాడ పద్మావతి నిర్మించారు.

శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘‘కొంతమంది చేతుల్లో థియేటర్లు ఉండటం వల్ల చిన్న సినిమాలకు థియేటర్లు దక్కట్లేదు. పండగలు, పెద్ద సినిమాలు లేనప్పుడు చిన్న సినిమాలు విడుదల చెయ్యాలా? చిన్నా పెద్ద తేడా లేకుండా తెరకెక్కిన ప్రతి సినిమా విడుదలైనప్పుడే పరిశ్రమ బావుంటుంది’’ అని అన్నారు. సినిమా గురించి చెబుతూ ‘‘మానవ విలువల్ని ఆర్థిక విలువలు డామినేట్‌ చేస్తున్న తరుణంలో డబ్బు లేకుండా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన కథే ఈ చిత్రం. నిర్మాత కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. సావిత్రిగారి తర్వాత నేను బాగా ఇష్టపడే నటి జయసుధ. ఆమెతో కలిసి నటించడం గొప్ప అనుభూతి. ఓ పాటలో ఆమెను బుగ్గ మీద కొట్టే సీన్ చెయ్యడానికి చాలా భయపడ్డా. ఆవిడ ఇచ్చిన సపోర్ట్‌ ఆ సీన్ బాగా చేశా’’ అని చెప్పారు.


Teluguwow Tv

Related News