సర్జరీ ఆపేసి బొద్దింకను వీడియో తీశారు..!

Mumbai doctor stops surgery midway to take picture of cockroach

ఛత్రపతి శివాజీ మహరాజ్ హస్పిటల్... థానేలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి... 45 యేళ్ల ఓ వ్యక్తి కాలుకు శస్త్ర చికిత్స జరుగుతోంది. ఇంతలో డాక్టర్ కాళ్ల దగ్గర ఓ బొద్దింక దర్శనమిచ్చింది. అంతే ఒక్కసారిగా డాక్టర్ ఈ వ్యక్తికి చేస్తున్న సర్జరీ ఆపేసి బొద్దింకను వీడియో తీశారు. ఆస్పత్రి మొత్తంలో అత్యంత శుభ్రంగా ఉండాల్సిన కీలక ప్రదేశం ఆపరేషన్ థియేటర్... అందులోనే ఇలాంటి పరిస్థితి తలెత్తడంపై డాక్టర్లకు చిర్రెత్తుకొచ్చింది. ఈ వ్యవహారాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతోనే తాను వీడియో తీసినట్టు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సంజయ్ బరన్వాల్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ చేస్తుండగా బొద్దింక లోపలికి వచ్చింది.

ఆస్పత్రిలో రోగులకు సదుపాయాలు అందించడంలో యాజమాన్యం ఎంత దారుణంగా విఫలమైందో కళ్లకు కట్టేలా ఆయన దానిని ఫొటోలు తీసినట్టు తెలిపారు. అయితే ఆ సమయంలో రోగికి ఎలాంటి ఇబ్బందీ రానివ్వలేదనీ... అతడిని చూసుకునేందుకు మిగతా వైద్యులు అక్కడే నిలబడి ఉన్నట్టు తెలిపారు. వెంటనే మళ్లీ సర్జరీ నిర్వహించామన్నారు. థానే మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆస్పత్రిలో పరిశుభ్రత లోపించడంపై ఆయన గత నెలలో అనేకమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీనివల్ల రోగులకు ఇప్పటికే రకరకాల జబ్బులు సంక్రమించినట్టు సీనియర్ వైద్యులు సైతం చెబుతున్నారు. ఆస్పత్రిలో చికిత్సకు వచ్చివెళ్లిన వారిలో 25 శాతంమందికి... సర్జరీ తర్వాత మళ్లీ సమస్యలు తలెత్తడంతో తిరిగి ఆస్పత్రికి రావాల్సి వచ్చినట్టు తెలిపారు.


Teluguwow Tv

Related News